Green card:గ్రీన్ కార్డు కోసం ఓ ప్రతిపాదన .. వారు 20 వేల డాలర్లు చెల్లిస్తే
అమెరికాలో శాశ్వత నివాసానికి జారీ చేసే గ్రీన్ కార్డు (Green card) కోసం ఏళ్ల తరబడి నిరీక్షణకు చెక్ పెట్టేందుకు ఓ ప్రతిపాదన ముందుకువచ్చింది. గ్రీన్‌కార్డు కోసం పదేళ్లకు పైగా ఎదురుచూస్తున్న వారు 20 వేల డాలర్లు (రూ.17.5 లక్షలు) చెల్లిస్తే వారి దరఖాస్తును త్వరగా పరిష్కరించేందుకు అవకాశాన్నిచ్చే బిల్లును యూఎస్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. 2035లోగా చట్టబద్ధమైన వీసా బ్యాక్‌లాగ్‌లు గణనీయంగా తగ్గించేందుకు డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 పేరుతో సభ్యులు మారియా ఎల్విరా సలాజర్ (Maria Elvira Salazar) , వెరోనికా ఎస్కోబార్ (Veronica Escobar) ఆ బిల్లును ప్రతిపాదించారు. దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారానికి ఈ బిల్లును తెచ్చినట్లు సలాజర్ చెప్పారు.
కుటుంబం లేదా ఉద్యోగాల విభాగాల్లో గ్రీన్‌కార్డు కోసం దశాబ్దానికి పైగా నిరీక్షిస్తున్న వారు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు కింద 20 వేల డాలర్లు చెల్లించే అవకాశం ఉంటుంది. ఫీజు చెల్లించిన వారికి ప్రామాణిక క్యూ కంటే ముందు కార్డు పొందే అర్హత వస్తుంది. ఉద్యోగ ఆధారిత, ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల్లో ఒక్కో దేశానికి గరిష్ఠంగా ఉన్న 7 పరిమితిని 15 శాతానికి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ శాశ్వత నివాసానికి ఓ మార్గాన్ని బిల్లు సూచించింది. వర్క్ వీసా (Work visa) పై అమెరికాకు వచ్చిన వారి పిల్లలు (Children) పదేళ్ల పాటు స్థిరంగా ఇక్కడే నివాసం ఉన్నట్లయితే వారికి చట్టబద్ధ శాశ్వత నివాస (ఎల్పీఆర్) హోదాను కల్పించనున్నారు.







