సీఏఏపై అమెరికా వ్యాఖ్యలకు.. భారత్ కౌంటర్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కోసం భారత్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దానిపై అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యల కు భారత్ దీటుగా స్పందించింది. అవి కల్పితం, అనవసరమని వ్యాఖ్యానించింది. సీఏఏ అనేది కొత్తగా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించినది. ఎవరి నుంచి పౌరసత్వాన్ని లాక్కొనేది కాదు. తనకంటూ ఒక దేశం లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మర్యాదపూర్వకమైన జీవితాన్ని అందిస్తుంది. ఆ చట్టం ఒక దేశ అంతర్గత వ్యవహారం. భారత దేశ సమ్మిళిత సంప్రదాయాలకు, మానవ హక్కుల పరిరక్షణకు అనుగుణంగా ఉంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు సురక్షిత ప్రదేశాన్ని అందిస్తుంది అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. సీఏఏ అమలుకు సంబంధించి అమెరికా చేసిన ప్రకటన కల్పితమని, అనవసరమైందని మేం భావిస్తున్నాం. భారత్ బహుళ సంస్కృతులు, విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దు. మా శ్రేయాభిలాషులు, భాగస్వాములు సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించాలి అని అమెరికా వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు.






