USA: శాంతి చర్చలు నిలిచిపోతే ఆంక్షలు తప్పవు..రష్యా కు అమెరికా వార్నింగ్..

రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukrain)ల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ఇరుదేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను గురించి ప్రస్తావిస్తూ యూఎస్ విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఆగిపోతే రష్యా అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. సెనెట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రష్యా తనకు ఉన్న నియమాలను పేర్కొంటోంది. అది ఎలాంటి నియమాలు పెడుతుందనేది ఇంకా తెలియదు. అవి అందిన తర్వాత యుద్ధం ముగింపుపై రష్యా వైఖరి ఏంటనేది తెలుస్తుంది. ఈసారి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నా’ అని రూబియో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆంక్షలు విధించడం గురించి ప్రస్తావిస్తూ.. శాంతి కొనసాగించడానికి రష్యా ఇష్టపడకపోయినా, యుద్ధం కొనసాగించాలని భావించినా అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, చర్చల సమయంలో ఆంక్షలు విధించడం గురించి మాట్లాడితే దౌత్య ప్రక్రియ దెబ్బతింటుందన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొల్పేందుకు అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కట్టుబడి ఉన్నారన్నారు. కాగా.. ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న రష్యాపై తాజాగా ఐరోపా సంఘం(EU), బ్రిటన్ ఆంక్షలు విధించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్‌తో ఫోన్‌కాల్ అనంతరం తెలిపారు. ఉక్రెయిన్‌తో కలిసి శాంతిస్థాపనకు అంగీకరించిన ఆయన.. అందుకు పలు నియమాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు సరైన దిశలోనే సాగుతున్నాయన్నారు. ఈ ఫోన్‌కాల్ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ. ఇరుదేశాలు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా మాట్లాడారు. యుద్ధం ముగించే ఉద్దేశం రష్యాకు ఉన్నట్లు తనకు అనిపించడం లేదని అనంతరం జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.