Ind vs Eng: ఆ బౌలర్లు ఎక్కడ..? కెవిన్ పీటర్సన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
వరల్డ్ క్రికెట్ లో ఏ ఫార్మాట్ చూసుకున్నా పరుగుల వరద పారుతోంది. గతంలో ఉన్న బౌలర్లు ఇప్పుడు ఏ దేశానికి లేకపోవడంతో బ్యాట్స్‌మెన్ ల డామినేషన్ ఎక్కువగా నడుస్తోంది. దానికి తోడు సిక్సులు కొడితేనే క్రికెటర్ అనే భావనలో కూడా క్రికెటర్లు ఉన్నారు. దీనిపై మాజీ క్రికెటర్లు ఎన్నో సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర చర్చకు తెర తీసాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్(Joe Root) టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండవ క్రికెటర్ గా నిలిచిన తర్వాత పీటర్సన్ ఆసక్తికర కామెంట్ చేసాడు.
ప్రస్తుత యుగంలో బ్యాటింగ్ 20-25 సంవత్సరాల క్రితం కంటే “చాలా సులభం” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. “నన్ను అరవకండి కానీ ఈ రోజుల్లో బ్యాటింగ్ చేయడం 20/25 సంవత్సరాల క్రితం కంటే చాలా సులభం” అన్నాడు. “వకార్, షోయబ్, అక్రమ్, ముష్తాక్, కుంబ్లే, శ్రీనాథ్, హర్భజన్, డోనాల్డ్, పొల్లాక్, క్లూసెనర్, గౌఫ్, మెక్‌గ్రాత్, లీ, వార్న్, గిల్లెస్పీ, బాండ్, వెట్టోరి, కైర్న్స్, వాస్, మురళి, కర్ట్లీ, కోర్ట్నీ, జాబితా ఇంకా ఉంది. పైన 22 పేర్లు చెప్పాను. వాళ్ళతో పోల్చగలిగే 10 మంది బౌలర్ల పేరు చెప్పండి” అని పోస్ట్ చేసాడు.
భారత్ (India)తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో 3వ రోజున రూట్ 248 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో, రూట్, రికీ పాంటింగ్‌ను అధిగమించి టెస్ట్ క్రికెట్లో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా రూట్ విషయంలో ఓ విమర్శ ఉంది. బలమైన బౌలింగ్ లైనప్ మీద అతను ఆడలేడు అని. ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క సెంచరీ కూడా అతను ఇప్పటి వరకు చేయలేదు. పిచ్ కఠినంగా ఉన్న సందర్భాల్లో కూడా రూట్ వికెట్ పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. భారత బౌలింగ్ బలహీనంగా ఉండటం, పిచ్ నుంచి సహకారం అందడంతో రూట్ స్వేచ్చగా ఆడాడు.






