అమెరికా, చైనా దేశాధినేతలు.. పరస్పరం వాగ్వాదం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాధినేతలు బైడెన్, జిన్‌పింగ్ ఫోన్లోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కాల్ ఇరు దేశాల మధ్య సంబంధాల్లో టెన్షన్‌ను మరింత పెంచింది. మరికొన్ని రోజుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు మంత్రులు చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దాదాపు ఐదు నెలల తర్వాత అమెరికా, చైనా అధ్యక్షులు తొలిసారిగా నేరుగా ఫోన్‌కాల్‌లో మాట్లాడుకొన్నారు. ఒక దశలో పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. తమ దేశానికి అత్యాధునిక టెక్నాలజీ ఉత్పత్తుల విక్రయంపై బైడెన్ సర్కార్ విధించిన బ్యాన్ ఆర్థిక ముప్పును పెంచుతోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆరోపించారు. మా హైటెక్ అభివృద్ధిని అణచివేయాలని, బీజింగ్‌కు ఉన్న ఎదిగే హక్కును కాలరాయాలని ప్రయత్నిస్తే మేము చూస్తు ఊరుకోం అని ఆయన నేరుగా బైడెన్‌ను హెచ్చరించారు. అంతేకాదు తైవాన్ విషయంలో అమెరికా లక్ష్మణ రేఖను దాటకూడదని తేల్చి చెప్పారు.






