అమెరికాలో జన్ సూరజ్ పార్టీ శాఖ ప్రారంభం
బిహార్ విఫలమైన ఓ రాష్ట్రమని జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమెరికాలో పార్టీ శాఖను ప్రారంభించిన అనంతరం అక్కడి ప్రవాస బిహారీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రశాంత్ మాట్లాడారు. బిహార్ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఒక వేళ ఈ రాష్ట్రం దేశంగా ఉండి ఉంటే, అధిక జనాభా దేశాల జాబితాలో 11వ స్థానంలో నిలిచేది. ప్రస్తుతం బిహార్ జనాభా జపాన్ను మించి పోయింది అని పేర్కొన్నారు. ఇకనైనా బిహార్లో పరిస్థితులను మెరుగుపరచాలన్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్లో జన్ సూరజ్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మా ప్రభుత్వ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, మద్యపానాన్ని నిషేధిస్తామని, రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చారు.






