నేను మీ ఇంటి పేరు మారిస్తే.. అది నాదవుతుందా?
చైనా కవ్వింపు చర్యలను భారత్ విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తీవ్రంగా ఖండించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కొత్తగా పేర్లు పెట్టింది. నామకరణాలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని మంత్రి గట్టిగా బదులిచ్చారు. గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా పెట్టిన కొత్త పేర్లపై జై శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ.. నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే.. ఆ ఇల్లు నాదవుతుందా? అని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మనం సైన్యం ఉంది అని స్పష్టం చేశారు.






