Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి.. భగ్గుమన్న పశ్చిమాసియా..

అనుకున్నంత అయింది. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ (Israel) శుక్రవారం భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ సైతం అంతేస్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్ అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడిచేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి.
ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్‌పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెలి అవీవ్, జెరూసలేంలలో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయెలీలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల లక్ష్యంగా శుక్రవారం రాత్రి రెండు వందలకు పైగా క్షిపణులు టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. దేశంలో మాత్రం ఆత్యయిక పరిస్థితిని విధించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది.
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్‌పై హూంకరించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు సూచించారు. తాజా ఘర్షణపై ప్రపంచ దేశాలు స్పందించాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరుదేశాలకు హితవుపలికాయి. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలను, సైనిక వ్యవస్థలను అమెరికా తరలిస్తోంది.
తాజా దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డజన్ల కొద్ది రాడార్ కేంద్రాలనూ ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది. దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని ప్రకటించింది. కెర్మాన్‌షాహ్, టెహ్రాన్‌లలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది. తమ అణు కేంద్రాలు సురక్షితంగానే ఉన్నాయనే అర్థం స్ఫురించేలా…దాడుల జరిగిన ప్రాంతాల్లో రేడియేషన్ ఏమీ పెరగలేదని ఇరాన్ పేర్కొంది. ఇరాన్‌లోని నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా ధ్రువీకరించింది.
అవును..వారు మృతి చెందారు: ఖమేని
ఇరాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పేలుళ్లలో ఆ దేశానికి చెందిన పలువురు సైనికాధికారులతో పాటు మూడు మిలిటరీ విభాగాల అధినేతలూ చనిపోయారు. వీరిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ హాజీజదే ఉన్నట్లు సుప్రీం లీడర్ ఖమేని నిర్ధారించారు. దీంతో ఆ దేశం కీలక సైనిక నాయకత్వాన్ని కోల్పోయినట్లు అయింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించింది. అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ హెచ్చరించారు. నివాసాలపై దాడిచేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసిందని ఖమేనీ మండిపడ్డారు. ఆ వెంటనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులు మొదలయ్యాయి.
ఇరాన్‌పై తాజా దాడికి ఇజ్రాయెల్…‘రైజింగ్ లయన్’ అని పేరు పెట్టింది. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకే ఈ చర్యను చేపట్టామన్నారు. ‘రైజింగ్ లయన్’ తొలి దశ మాత్రమే పూర్తయ్యిందని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు.