Damascus: సిరియా రాజధానిపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు…

సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపుల మధ్య ఘర్షణల సమయంలో ఇజ్రాయెల్ (Israel) వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణను ఆసరాగా తీసుకుని.. సిరియా రాజధాని డమాస్కస్ (Damascus) పై విరుచుకుపడింది. డ్రూజ్ గ్రూపునకు మద్దతు పేరుతో .. సిరియా రక్షణశాఖ కార్యాలయం ప్రధాన ద్వారంవద్ద, అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో బాంబుల వర్షం కురిపించింది. సిరియా సైనిక దళాల కాన్వాయ్‌పైనా బాంబులేసింది. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా 34 మంది గాయపడ్డారు.
సిరియాలోని దక్షిణ ప్రాంత నగరం స్వెయిదాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపులకు మధ్య బుధవారం ఉదయం మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘర్షణలు జరగడం గమనార్హం. స్వెయిదాలో స్థానిక సున్నీ బెదోయిన్ గిరిజన తెగలు, డ్రూజ్ వర్గాల మధ్య కిడ్నాప్‌లు, దాడులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ బలగాలు.. డ్రూజ్ సభ్యులను భారీగా హతమార్చడంతోపాటు వారి ఇళ్లను తగలబెట్టాయి. అయితే డ్రూజ్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో రెండు వర్గాలు సాయంత్రానికి దిగివచ్చాయి. మళ్లీ కాల్పుల విరమణను ప్రకటించాయి.
అసద్ సర్కార్ పతనం తర్వాత గద్దెనెక్కిన నూతన ప్రభుత్వాన్ని ఉగ్రవాద ప్రభుత్వంగా పరిగణిస్తున్న ఇజ్రాయెల్…దాన్ని ఇప్పటికే ఉగ్రశక్తులకు ఆశ్రయమివ్వొద్దని హెచ్చరించింది. కాదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పుడు డ్రూజ్ వర్గాన్ని పరిరక్షించేందుకు తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ జోక్యాన్ని డ్రూజ్ సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.