దొరికిన రూ.7కోట్ల లాటరీ.. తిరిగి ఇచ్చిన భారతీయ కుటుంబం

అనుకోకుండా దొరికిన ఓ లాటరీ టికెట్‍కు రూ.7 కోట్ల లాటరీ తగిలింది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? అ డబ్బంతా తీసుకొని గప్‍చుప్‍గా ఉంటారు. అయితే, అమెరికాలోని భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అలా చేయలేదు. లాటరీ టికెట్ కొన్న వ్యక్తిని పిలిచి మరీ ఆ టికెట్‍ను తిరిగి ఇచ్చేసింది. ఈ అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. సౌత్‍విక్‍లో మౌనిశ్ షా కుటుంబం ఓ లాటరీ దుకాణాన్ని నడుపుతున్నది. లీ రోజ్ ఫిగా అనే మహిళ ఆ షాప్‍కు రెగ్యులర్ కస్టమర్. గత మార్చిలో ఆమె ఓ లాటరీ టికెట్‍ను ఆ షాప్ నుంచి కొనుగోలు చేసింది. అయితే లాటరీ ఎలాగూ తగలదులే అనే ఉద్దేశంతో టిక్‍ను పూర్తిగా స్క్రాచ్ చేయకుండానే దాన్ని పారేయమని షాప్ వారికి తిరిగి ఇచ్చేసింది. మౌనిశ్ షా కుమారుడు అభి సా ఆ టికెట్‍ను చూసి పూర్తిగా స్క్రాచ్ చేశాడు. ఆ టికెట్‍కు 10 లక్షల డాలర్ల (రూ.7.27 కోట్ల) బహుమతి లభించినట్లు గుర్తించాడు. కుటుంబ సభ్యులతో చర్చించి లీ రోజ్ ఎక్కడ ఉన్నదో వెతికి మరి పట్టుకొని ఆమెకు ఆ టికెట్‍ను ఇచ్చేశాడు. మౌనిశ్ షా కుటుంబం నిజాయితీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.