Bihar: ఒంటరి పోరే..? కాంగ్రెస్ కీలక నిర్ణయం..?

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి జాతీయ రాజకీయ వర్గాలు. గత కొన్నాళ్లుగా ఆర్జెడి(RJD), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా సీట్ల ఒప్పందం విషయంలో ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ పట్టుబట్టడంతో, రాహుల్ గాంధీ(Rahul Gandhi) పొత్తు నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 70 స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
మిగిలిన 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని, ముందే అంచనా వేసి పోటీపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అలాగే పరిమితం చేయాలని, తేజస్వి యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. గతంలో కంటే తక్కువ స్థానాలు ఇవ్వటమే కాకుండా, ఉపముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా తేజస్వీ యాదవ్ అనుసరిస్తున్న వైఖరి పై, రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నారు. ఓటు చోరీ అంశంలో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున బీహార్ లో పోరాటం చేస్తున్నారు.
ఈ విషయంలో తేజస్వి యాదవ్ కంటే రాహుల్ గాంధీనే ముందున్నారు. దానికి తోడు పదేపదే కాంగ్రెస్ పార్టీని ఆర్జెడి బెదిరించడం కూడా రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారు. అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తేజస్వి యాదవ్ వైఖరి పై అసహనంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనితో ఈనెల 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పాట్నాలో భేటీ అవుతుంది. ఈ భేటీలో పోటీ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ భేటీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో పాటుగా శాసనసభ పక్ష నేతలు కూడా ఆహ్వానించింది కాంగ్రెస్ అధిష్టానం.
2023 తెలంగాణా ఎన్నికల సందర్భంగా కూడా ఇలాగే హైదరాబాద్ లో భేటీ అయి, పోటీ విషయంలో ధైర్యంగా ముందుకు అడుగు వేసి అధికారంలోకి వచ్చింది. ఇక బీహార్ లో దాదాపుగా నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బీహార్ లో వామపక్షాలతో పాటుగా, మిగిలిన చిన్న పార్టీలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.