Nara Lokesh: ఏపీ యువతకు కొత్త అవకాశాలు ..మంగళగిరిలో మెగా జాబ్ ఫెయిర్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. గత ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళగిరి (Mangalagiri)లోని విటిజేఎం-ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న మెగా జాబ్ ఫెయిర్ జరగనుంది.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (AP Skill Development Corporation) నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాలో దాదాపు 2200 ఉద్యోగాలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సూచనలతో ఈ జాబ్ మేళా జరగనుండటం ప్రత్యేకత.
జాబ్ మేళాలో పాల్గొనే సంస్థలు ఐటీసీ (ITC), టాటా (TATA), ఫాక్స్‌కాన్ (Foxconn), రేమండ్స్ (Raymonds), ర్యాపిడో (Rapido)తో పాటు మరో ఐదు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఇవి విభిన్న రంగాల్లో ఉద్యోగాలను అందిస్తున్నాయి. మెషీన్ ఆపరేటర్, జూనియర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ స్టాఫ్, రైడ్ ఆపరేటర్, టికెట్ కౌంటర్, కస్టమర్ సపోర్ట్, టీమ్ లీడర్, హెచ్ ఆర్ ట్రెయినీ, జూనియర్ చెఫ్, డెలివరీ పార్ట్‌నర్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు కనీసం నెలకు ₹14,000 జీతం నుంచి గరిష్టంగా ₹75,000 వరకు వేతనం ఉంటుంది. నిరుద్యోగులు తమ అర్హతల ఆధారంగా విభిన్న అవకాశాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్, డిగ్రీ, టెక్నికల్ కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
అర్హత పరంగా 18 సంవత్సరాలు నిండినవారు నుంచి 45 ఏళ్ల వరకు ఉన్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నిరుద్యోగులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అందుకు https://naipunyam.ap.gov.in/user-registration అనే వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు.
అలాగే ఈ జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు కూడా విడుదల చేశారు. పి.శ్రావణి (P. Shravani)ను 9347372996లో లేదా ఎస్.కె.బాజీ (S.K. Baji)ను 7780588993లో సంప్రదించవచ్చు. అదనంగా 9988853335 నంబర్‌కు కాల్ చేసి కూడా సమాచారం పొందవచ్చు. ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని అంచనా. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడమే కాకుండా, యువతకు కొత్త అవకాశాలను తెరుచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మంగళగిరిలో జరగబోయే ఈ మెగా జాబ్ ఫెయిర్ ఆ దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.