India-US: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం: రణధీర్ జైస్వాల్

భారత్, అమెరికాల (India-US) మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు. ఇరు దేశాలకు లాభదాయకమైన ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చలు చాలా ఫలవంతంగా జరిగాయని చెప్పారు.
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంపై జైస్వాల్ (Randheer Jaiswal) స్పందిస్తూ.. ఇంధనం, పెట్టుబడి, వాణిజ్యం, భద్రత వంటి కీలక రంగాల్లో సౌదీ అరేబియా, భారత్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయని, ఈ రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని వివరించారు.
ఉగ్రవాదంపై (Terrorism) భారత్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని ఆయన (Randheer Jaiswal) నొక్కి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం ఉగ్రవాద సంస్థలతో లోతైన సంబంధాలను కలిగి ఉన్నాయని, ఈ విషయం ప్రపంచానికి తెలిసిందేనని అన్నారు. ఉగ్రవాదం పట్ల భారత్ ఎల్లప్పుడూ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.