Colombo: భారత్ నిజంగానే పెద్దన్న.. తుఫాన్ సాయానికి లంక కృతజ్ఞతలు
ఈ ప్రపంచంలో అత్యంత ధనికమైన, ఆయుధ సంపత్తిలో ముందుండే దేశాన్ని సాదారణంగా పెద్దన్న అని పిలుస్తాం. అందుకే అగ్రరాజ్యాన్ని పెద్దన్నగా అభివర్ణిస్తాం. ఆ డబ్బు, ఆయుధ బలం చూపి.. అమెరికా, ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తోంది కూడా. అయితే నిజంగా పెద్దన్న అంటే.. ఆపదలో ఉన్న పొరుగు దేశాన్ని ఆదుకోవడం. ఆవిషయంలో మనదేశం ఎప్పుడు పెద్దన్నే. ఇది మనమంటున్న మాట కాదు.. ఆపత్కాలంలో మనదేశం స్పందించే తీరే ఇందుకు నిదర్శనం
తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన పొరుగుదేశం లంక విషయంలో భారత్ మరోసారి తన ఆపన్నహస్తాన్ని అందించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ఈ ఆపరేషన్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సి-130జె విమానాల ద్వారా ఇప్పటికే 53 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువులు ఉన్నాయి. ఇది తొలి విడత సాయం మాత్రమేనని, శ్రీలంకకు సహాయక చర్యలు కొనసాగుతాయని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
శ్రీలంకలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ కష్టకాలంలో భారత్ అందిస్తున్న సహాయం పట్ల శ్రీలంక ప్రభుత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకుంది. భారత్ అందిస్తున్న చేయూత ఇరు దేశాల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






