అక్టోబరు 31 నాటికి అమెరికా, భారత మధ్య ఒప్పందం
అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు చేసే ఒప్పందంపై భారత ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. అక్టోబరు 31 నాటికి సంతకాలు పూర్తయ్యేలా సన్నాహాలు మొదలుపెట్టింది. రక్షణ కొనుగోళ్ల మండలి ఇప్పటికే దీనికి ఆమోదం తెలిపింది. తుది ధరపై అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ సమ్మతించిన అనంతరం మంత్రివర్గం తుది ఆమోదం లభిస్తుంది. ఒప్పందం విలువ 310 కోట్ల డాలర్లు. మొత్తం 31ఎంక్యూ9బీ డ్రోన్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటామిక్స్ సంస్థ సమకూర్చనుంది. 16 డ్రోన్లను నౌకాదళానికి, ఎనిమిదింటిని సైన్యానికి, మిగిలిన ఏడు వాయుసేనకు కేటాయించనున్నారు. వాస్తవాదీన రేఖ వెంబడి వాడేందుకు ఇవి అవసరమని సైన్యం భావిస్తోంది. చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు ఏకబిగిన 34 గంటలకు పైగా గాల్లో ఉండగలవు. నాలుగు క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు.






