భారత్ పనితీరు అద్భుతం : డేనిస్ ఫ్రాన్సిస్
పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసేందుకు డిజిటలైజేషన్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతో భారత్ పనితీరు అద్భుతమని ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేనిస్ ఫ్రాన్సిస్ కొనియాడారు. జనవరి 22-26 మధ్య ఫ్రాన్సిస్ భారత్‌లో పర్యటించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జైపుర్, ముంబయిలకు వెళ్లిన ఆయన పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధోసంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆధారం చేసుకొని డిజిటలైజేషన్ వినియోగంతో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు. మహిళలు, రైతుల నుంచి ప్రతి ఒక్కరూ తామున్న చోటు నుంచే చెల్లింపులు చేస్తున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల్లోనూ భారత్ గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నట్లు గమనించామని ఫ్రాన్సిస్ తెలిపారు.






