India Growth: భారత వృద్ధి అంచనాలు పెంచిన ఐఎంఎఫ్

భారత ఆర్థిక వృద్ధి (India Growth) అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) స్వల్పంగా పెంచింది. తాజాగా విడుదల చేసిన ఐఎంఎఫ్ (IMF) నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) దేశ జీడీపీ వృద్ధి అంచనాను 0.2 శాతం పెంచి 6.6 శాతంగా నిర్ణయించింది. బలమైన దేశీయ వినియోగం, అలాగే ఐటీ, వ్యాపార సేవల వంటి దేశీయ సేవలు భారత్‌లో బలంగా ఎదుగుతున్నాయని, వాటి ఎగుమతులు కూడా బలంగా ఉండటం వల్లే భారత్ ఈ వృద్ధి (India Growth) వేగాన్ని కొనసాగించగలుగుతోందని ఐఎంఎఫ్ (IMF) అభిప్రాయపడింది. ఇది డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడుతుందని, అలాగే దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) తగ్గడం కూడా భారత్‌కు సానుకూల అంశమని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం అదనంగా విధించిన సుంకాల (టారిఫ్‌ల) ప్రభావాన్ని కూడా భారత దేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడగలుగుతోందని ఐఎంఎఫ్ (IMF) పేర్కొంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపిన ఐఎంఎఫ్.. అమెరికా సుంకాల (US Tariffs) కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) భారత వృద్ధి అంచనాను మాత్రం 6.3 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయినా సరే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ (India Growth) కొనసాగుతోందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.