Visa: అమ్మో అమెరికా అంటున్న హైదరాబాదీ స్టూడెంట్స్

ఉన్నత చదువులు అంటే చాలు అమెరికా(United States).. గత పదేళ్ళ నుంచి ఇది బాగా వినపడుతోంది. ఆస్తులు అమ్మి ఒకరు, అప్పులు చేసి మరొకరు.. ఇలా అగ్ర రాజ్యానికి క్యూ కడుతూనే ఉన్నారు. కాని అక్కడ ఎప్పుడు, ఎలా ఉంటుందో అర్ధం కాక చుక్కలు చూస్తున్నారు మన వాళ్ళు. కేవలం మన వాళ్ళే కాదు ఇతర దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది. డోనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండవ సారి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ రివర్స్ లో నడుస్తోంది. అందుకే ఇండియా నుంచి పెద్దగా అమెరికా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు స్టూడెంట్స్.
తాజాగా ఓ నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది. అమెరికా విశ్వవిద్యాలయాలకు భారతీయ విద్యార్థుల అడ్మిషన్ లు బాగా తగ్గాయత. ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో అంతర్జాతీయ విద్యార్థులు ఆ దేశానికి రావాలంటేనే భయపడుతున్నారట. తాజాగా హైదరాబాద్ లో వీసా స్లాట్ లు బుక్ చేసుకునే వారి సంఖ్యపై ఓ లెక్క బయటకు వచ్చింది. అమెరికా వీసాల కోసం అప్లై చేసే వారి సంఖ్య 70 శాతం తగ్గిందని గుర్తించారు. వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో ఫ్రీజ్ ఉండటం, రిజెక్ట్ రేట్స్ తో ఈ పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సంజీవ్ రాయ్ మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పారు. సాధారణంగా ఈ సమయానికి, చాలా మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసుకుని, విమాన ప్రయాణానికి సిద్దమవుతూ ఉంటారట. ఈ సంవత్సరం, కొత్త స్లాట్ లు బుక్ అవుతాయా అని.. ప్రతిరోజూ పోర్టల్‌ను రిఫ్రెష్ చేస్తున్నామని.. కాని బుకింగ్స్ మాత్రం లేవన్నారు.
ఇన్నేళ్ళలో ఇదే చెత్త ఏడాది అంటూ ఆయన కామెంట్ చేసారు. వీసా స్లాట్‌లను దశలవారీగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీనితో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని సంజీవ్ పేర్కొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో స్లాట్‌లు విడుదల కాకపోతే, వేలాది మంది విద్యార్ధుల అమెరికా కల చేదిరిపోతుందన్నారు.