Saurabh Anand : ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి
                                    ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అడిలైడ్(Adelaide) లో భారతీయ విద్యార్థిపై దాడిని మరువకముందే మెల్బోర్న్(Melbourne) లో మరొకరిపై దాడి జరిగింది. ఈ నెల 19న భారత సంతతికి చెందిన సౌరభ్ ఆనంద్ (Saurabh Anand) (33)పై హింసాత్మక దాడి జరిగింది. సౌరభ్ ఆల్టోనా మీడోస్లోని మెడికల్ స్టోర్ (Medical store) కు వెళ్లారు. మందులు కొనుక్కుని తిరిగి ఇంటికి వెళ్తూ, తన ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఐదుగురు టీనేజర్లు ఆయనపై విరుచుకుపడ్డారు. వారిలో ఒకడు ఆయన జేబులను తనిఖీ చేశాడు. మరొకడు ఆయన తలపై పదే పదే పిడిగుద్దులు కురిపించాడు. మూడోవాడు కత్తి తీసుకుని, ఆయన గొంతుపై పెట్టాడు. తన ముఖంపై దెబ్బలు తగలకుండా కాపాడుకోవడం కోసం తన చేతిని అడ్డు పెట్టుకున్నానని సౌరభ్ చెప్పారు. మొదటి కత్తి వేటు మణికట్టుపై పడిందని, రెండోది చేతిని, మూడోది ఎముకను తెగ నరికిందని చెప్పారు. తన వెన్నెముక విరిగిందని తెలిపారు. తన చెయ్యి ఓ దారానికి వేలాడదీసినట్లు అయిందన్నారు. రాయల్ మెల్బోర్న్ హాస్పిటల్ (Royal Melbourne Hospital )వైద్యులు మొదట్లో ఆయన చేతిని తొలగించవలసి ఉంటుందని భావించారు. కానీ స్క్రూలు వంటివాటి సహాయంతో దానిని విజయవంతంగా అతికించగలిగారు. దాడిచేసిన ఐదుగురిలో నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.







