H-1B visa : హెచ్-1బీ వీసా జారీలో కీలక మార్పులు … ఇకపై

అమెరికాలో హెచ్-1బీ వీసా (H-1B visa) జారీ విధానంలో గణనీయమైన సంస్కరణలు తీసుకురావాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయించారు. ఈ వీసా ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు, నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు కొత్త ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ కార్యాలయానికి సవరణల ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇకపై హెచ్-1బీ వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి జీతం (Salary), ఉద్యోగ స్థాయి వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం హెచ్-1బీ వీసాల జారీ కోసం అమెరికా కాంగ్రెస్ (US Congress) ప్రతి యేటా 85,000 వీసాల పరిమితిని నిర్ణయిస్తుంది. ఇందులో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (Masters degree) లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత కలిగిన వారి కోసం రిజర్వ్ చేశారు. అదనంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల కోసం పరిమితి లేకుండా వీసాలు జారీ చేస్తారు. పరిమితిని మించి వీసా కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు వస్తున్నందున, లాటరీ విధానంలో వీసా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన హెచ్-1బీ నిపుణులను కంపెనీలు అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.