వారిని పట్టుకోవడానికి భారత్ తో కలిసి పనిచేస్తున్నాం : అమెరికా
ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపన్నిన వారిని పట్టుకోవడానికి భారత్తో కలిసి పనిచేస్తున్నామని అమెరికా పేర్కొంది. భారత్, అమెరికా దేశాల మధ్య ఇది తీవ్రమైన అంశం. మా దేశ భూభాగంపై మా పౌరుడిని చంపడానికి భారత్కు చెందిన ఓ వ్యక్తి తన దేశంతో కలిసి కుట్ర పన్నారని న్యాయ విభాగం ఆరోపించింది. దీన్ని మేం తీవ్రమైన అంశంగా తీసుకుని భారత్ దృష్టికి తీసుకెళ్లాం అని కాంగ్రెస్లో విచారణ సందర్భంగా స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ తెలిపారు. కాగా భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూ హత్యకు కుట్రపన్నారని ఆరోపిస్తూ నిఖిల్ గుప్తా అనే వ్యక్తిపై గత నవంబరులో అమెరికా ప్రాసిక్యూటర్స్ నేరాభియోగాలు మోపారు. దీనిపై దర్యాప్తు చేయడానికి భారత్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.






