Green card: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారుల పిల్లలకు బిగ్ షాక్

అమెరికాలో ఉంటున్న విదేశీయుల పిల్లలకు గ్రీన్ కార్డ్ (Green card) ఇచ్చే విషయంలో సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్ సీఐఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసా (H-1B visa) పై అగ్రరాజ్యంలో ఉంటూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పిల్లలకు, ఆయా దరఖాస్తుల తుది పరిశీలన సమయానికి 21 ఏళ్లు నిండితే అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు యూఎస్ సీఐఎస్ (USCIS) ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసే సమయానికి పిల్లలకు 21 ఏళ్లలోపు ఉన్నప్పటికీ, వాటిని పరిశీలించి, గ్రీన్ కార్డు మంజూరు చేసే సమయానికి కనుక వారు నిర్ణీత వయసును మించిపోతే, వారిని గ్రీన్‌కార్డ్‌కు అనర్హులుగా గుర్తిస్తారు. ఇలాంటి వారు ప్రత్యేక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని యూఎస్ సీఐఎస్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 15 నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. వాస్తవానికి హెచ్-1బీ వీసాలు దక్కడమే గగనంగా మారింది. ఏళ్ల తరబడి సమయం పడుతోంది. గ్రీన్ కార్డుల దరఖాస్తులు కూడా ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) గ్రీన్‌కార్డు దరఖాస్తు దారులకు వెసులుబాటు కల్పించారు. హెచ్-1బీ వీసాదారుల దరఖాస్తు సమయానికి వారి పిల్లలకు 21 ఏళ్లలోపు వయసు ఉంటే, గ్రీన్‌కార్డు ఎప్పుడు మంజూ రు చేసినా ఆ వయసునే పరిగణనలోకి తీసుకునేవారు. దీనివల్ల వేలాది మందికి గ్రీన్‌కార్డులు లభించాయి. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ (Trump) మాత్రం గ్రీన్‌కార్డు కోరుకునేవారి పిల్లలకు 21ఏళ్లకు మించరాదన్న నిర్ణయాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఎందుకంటే హెచ్-1బీ వీసాదారులు ఏళ్ల తరబడి అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీరి పిల్లలకు ఈ నిబంధన వర్తిస్తే గ్రీన్‌కార్డుకు అనర్హులవుతారు. గ్రీన్‌కార్డు దరఖాస్తులు పరిశీలించి, తుదిచర్యలు తీసుకునే సమయానికి చిన్నారుల వయసు 21 ఏళ్లలోపు ఉంటేనే అనుమతిస్తారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో దరఖాస్తుల పరిశీలనకే ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ఫలితంగా 21 ఏళ్లు దాటిన వారిని గ్రీన్‌కార్డుకు అనర్హులుగా పేర్కొంటారు.