Ind vs Eng: గంభీర్ నీకో దండం, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ఓటమి, ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో తడబాటు.. గత ఏడాది కాలంగా భారత జట్టు పరిస్థితి ఇది. శ్రీలంకలో వన్డే సీరీస్ ఓటమిని పెద్ద సీరియస్ గా తీసుకోని అభిమానులు.. టెస్ట్ క్రికెట్ లో భారత జట్టు ప్రదర్శన చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా జట్టు కాన్ఫిడెన్స్ పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gambhir) అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్.
జట్టు కూర్పు విషయంలో, సీనియర్లను పక్కన పెట్టే విషయంలో అతని జోక్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు అభిమానులు. జట్టులో బూమ్రా(Bumrah) మినహా సమర్ధవంతమైన బౌలర్ కనపడటం లేదు. ఇదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జట్టును నాశనం చేస్తున్నాయి. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఉన్నా సరే అతనిని నాలుగో టెస్ట్ కు పక్కన పెట్టడం అభిమానులను చికాకు పెట్టే అంశంగా చెప్పాలి. స్పిన్ తిరిగే పిచ్ పై అతనిని ఆడించకపోవడం మంచిది కాదని గంభీర్ ను తప్పుబడుతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో వాషింగ్టన్ సుందర్ ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అతన్ని 8వ స్థానంలో బ్యాటింగ్ కు పంపడం మంచి నిర్ణయం కాదని, సెంచరీ చేయగలిగే సమర్ధత ఉన్న ఆటగాడిని అలా ఎలా నాశనం చేస్తారని మండిపడుతున్నారు. మూడవ టెస్ట్ లో నైట్ వాచ్మెన్ ను పంపిన నిర్ణయంపై కూడా విమర్శలు వచ్చాయి. వ్యూహాలను అమలు చేసే విషయంలో కెప్టెన్ కు అతని నుంచి సహకారం లేదనేది అభిమానుల ఆందోళన. అగ్ర జట్ల మాజీ ఆటగాళ్ళు సాధారణంగా సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ గంభీర్ మాత్రం వారి సలహాలు తీసుకోవడం లేదు. నియంత మాదిరిగా జట్టు ఎంపిక ఉందని, అతనిని కోచ్ గా పక్కన పెట్టకపోతే ఇండియన్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.