లండన్ లో రోడ్డు ప్రమాదం… భారతీయ విద్యార్థిని మృతి
విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలు కలచివేస్తున్నాయి. తాజాగా లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నీతీ అయోగ్ మాజీ ఉద్యోగురాలు, పీహెచ్డీ విద్యార్థి చేష్టా కొచ్చార్ ప్రాణాలు కోల్పోయారు. హర్యానా గురుగ్రామ్‌కు చెందిన చేష్టా (33) గత సెప్టెంబర్‌లో పీహెచ్డీ కోసం లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన రాత్రి 8:30 గంటల సమయంలో సెంట్రల్ లండన్ సైకిల్ పై ప్రయాణిస్తున్న చేష్టాను ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ కూతురే చేష్టా కొచ్చర్. కూతురి మరణవార్త విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదం చేష్టా కుటుంబంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్త చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో యూనివర్సిటీలో చదువుకున్నారు. 2021 నుంచి 23 మధ్యకాలం నీతి అయోగ్‌లో పని చేశారు. ఈ నేపథ్యంలో చేష్టా మృతిపై నీతీ అయోగ్ మాజీ సీఈఓ అబితాబ్కాంత్ స్పందించారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. చేష్టా ఎంతో దైర్యవంతురాలని, గతంలో తనతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. ఇంత త్వరగా ఆమె ఈ లోకాన్ని వదలివెళ్లడం బాధాకరమన్నారు.






