Elon Musk: హెచ్-1బీ వీసాపై ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు!
హెచ్1బీ వీసాలపై టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్.. హెచ్1బీ (H-1B) వీసా, అధిక నైపుణ్యం కలిగిన ఇమ్మిగ్రేషన్ అంశాలపై మాట్లాడారు. అమెరికా వలస వ్యతిరేక దేశంగా మారుతుందేమోనన్న నిఖిల్ కామత్ ప్రశ్నపై మస్క్ స్పందించారు. అమెరికా వృద్ధిలో భారతీయుల ప్రతిభ ప్రధాన పాత్ర పోషించిందని అంగీకరించారు. “ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అపారమైన ప్రయోజనాలు పొందిందని నేను భావిస్తున్నాను,” అని మస్క్ (Elon Musk) స్పష్టంచేశారు.
విదేశీయులు స్థానిక ఉద్యోగాలను లాక్కుంటున్నారనే ఆందోళనలను తోసిపుచ్చిన ఆయన.. టెక్ పరిశ్రమలో ఎప్పుడూ ప్రతిభావంతుల కొరత ఉంటుందని, మరింత మంది ప్రతిభావంతులైన వ్యక్తులు ఉండటం మంచిదని అన్నారు. అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటూ, వచ్చే ఏడాది నుంచి లక్ష డాలర్ల వీసా ఫీజు తీసుకుంటామని ప్రకటించిన సమయంలో మస్క్ (Elon Musk)ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని, మొత్తంగా ఈ పథకాన్ని నిలిపివేయడం మంచి ఆలోచన కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో భవిష్యత్తు టెక్నాలజీలపై కూడా మస్క్ కీలక హెచ్చరిక చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మాట్లాడిన మస్క్ (Elon Musk).. రాబోయే 10-20 ఏళ్లలో మనుషులకు పని చేయడం ఆప్షనల్‌గా మారే అవకాశముందని అన్నారు. అయితే ఏఐ మరింత శక్తివంతంగా మారినప్పుడు, హానికరమైన ఫలితాలను నివారించడానికి అది మానవ సంక్షేమానికి విలువనిచ్చేలా నిర్మించుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఏఐ, రోబోటిక్స్ మిగతా అన్నిరంగాలను నియంత్రిస్తాయని ఆయన పేర్కొన్నారు.






