EB-5 Visa: భారతీయ పెట్టుబడిదారుల కు ఇదో సువర్ణావకాశం… అమెరికాలో
అమెరికాలో పారిశ్రామికంగా స్థిరపడాలనుకునే వారికి ఈబీ-5 వీసా (EB-5 Visa) దోహదపడుతుందని, ఇది భారతీయ పెట్టుబడిదారులకు సువర్ణావకాశం కల్పిస్తోందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నాదదూర్ కుమార్ (Nadadur Kumar) పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన ఈబీ-5 వీసాపై మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులకు వైట్ పాస్పోర్ట్ (రీ-ఎంట్రీ పర్మిట్) లభిస్తుందని, తద్వారా రెండేళ్లపాటు (పరిమితిని పొడిగించుకోవచ్చు) అమెరికాలో ఉండవచ్చన్నారు. భారతీయులు ఈబీ-5 వీసా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతి దేశానికి 7 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కార్డులు ఇవ్వరని, భారత్ నుంచి ఇప్పటికే ఎఫ్-1, హెచ్-1బీ (H-1B), ఈబీ-5కి డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో మరింత వెయిటింగ్ పెరిగే అవకాశం ఉన్నందున ఈబీ-5ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గతంలో ఈబీ-5 కు ప్రాధాన్యం ఉండేది కాదని, ఇటీవల రియల్ ఎస్టేట్ ఆధారిత సంపద పెరగడంతో అనేక మంది భారతీయులు పెట్టుబడి పెట్టగలుగుతున్నారన్నారు. ప్రస్తుతం వివిధ వీసా విభాగాల్లో భారతీయులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, డిమాండ్ కోటా సంఖ్యను మించి ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈబీ-5 కింద కనీస పెట్టుబడి రూ.6-7 కోట్లు ఉందని, అమెరికాలోని కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తాము పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తే అక్కడి పౌరసత్వం సులువుగా లభిస్తోంని చెప్పారు. తద్వారా భర్త (Husband), భార్య (wife)తోపాటు 20 ఏళ్లలోపు పిల్లలు అమెరికా వెళ్లవచ్చన్నారు. అలాగే అక్కడి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పుడైనా రాకపోకలు సాగించవచ్చని, జీవితాంతం అక్కడ స్థిరపడవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఈబీ-5 వీసాపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.







