Donald Trump: యుద్ధం నేనే ఆపా.. ట్రంప్ తలనొప్పి కామెంట్స్

భారత్(India) – పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య యుద్ద వాతావరణం ఏమో గాని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ విషయంలో పదే పదే ట్రంప్ మాట్లాడుతున్న మాటలు దాయాదులకు తలనొప్పిగా మారాయి. పహల్గాం దాడి తర్వాత భారత ప్రతీకార చర్యలకు దిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో స్పందించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో డోనాల్డ్ ట్రంప్ ఎంటర్ కావడం, కాల్పుల విరమణ అంటూ రెండు దేశాలు ప్రకటించడం జరిగాయి.
ఈ రెండు దేశాల మధ్య అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు గాని.. ట్రంప్ మాత్రం నేనే యుద్దాన్ని ఆపా అంటూ ఒకటికి పది సార్లు చెప్పుకోవడం చూసి జనాలు కంగు తింటున్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విధంగా వ్యాఖ్యలు చేసారు. రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదు జెట్‌లు కూలిపోయాయని తనకు సమాచారం ఉందని ట్రంప్ కామెంట్ చేసారు. వైట్ హౌస్‌లో రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ప్రైవేట్ విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కాని ఆ విమానాలు ఏ దేశానివో ట్రంప్ చెప్పలేదు.
ఎవరు కూల్చారు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. గాల్లోనే విమానాలను నాశనం చేసారని కామెంట్ చేసారు. భారత్ – పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ ఆయుధాలు ఉన్న దేశాలన్న ట్రంప్.. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగకపోతే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే తాను యుద్దాన్ని ఆపానని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందం అడ్డం పెట్టుకుని యుద్ధం ఆపినట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే వాణిజ్య ఒప్పందాలు చేసుకునేది లేదని రెండు దేశాలకు చెప్పామని ట్రంప్ కామెంట్ చేసారు. ఇరాన్ – ఇజ్రాయిల్ విషయంలో అదే చేసామని ట్రంప్ పేర్కొన్నారు.