Divya: 19 ఏళ్ళకే ఎన్నో రికార్డులు, ఎవరీ దివ్య దేశ్‌ముఖ్..?
                                    ఫిడే(FIDE) మహిళల చెస్ ప్రపంచకప్ షిప్ లో విజేతగా నిలిచిన 19 ఏళ్ళ మరాఠి అమ్మాయి దివ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru hampi)పై దివ్య దేశ్‌ముఖ్ ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీనితో దివ్య దేశంలో 88వ గ్రాండ్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన దివ్య చిన్ననాటి నుంచే ఆటపై మక్కువతో మెళుకువలు నేర్చుకుని, ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక మరాఠీ కుటుంబంలో.. డాక్టర్ల దంపతులు జితేంద్ర, నమ్రత దేశ్‌ముఖ్‌లకు జన్మించిన దివ్య, భగవాన్‌దాస్ పురోహిత్ విద్యా మందిర్‌లో చదువుకుంది. ఈ విజయం కంటే ముందే దివ్య, ఉమెన్ గ్రాండ్‌మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకుంది. 2022 మహిళల ఇండియన్ చెస్ ఛాంపియన్షిప్ ను గెలిచింది. 2021లో భారతదేశ 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్ గా నిలిచింది. 2020 ఫిడే ఆన్లైన్ ఒలింపియాడ్‌లో భారత్ గోల్డ్ మెడల్ సాధించడంలో కీ రోల్ ప్లే చేసింది.
2022 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పథకం సాధించింది. 2023లో, దివ్య.. హారిక ద్రోణవల్లి, కోనేరు హంపి వంటి ఎలైట్ ఇండియన్ ప్లేయర్లను ఓడించి ఆసియా మహిళల చెస్ ఛాంపియన్షిప్, టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ డివిజన్లలో గెలిచింది. 2024 మేలో జరిగిన, షార్జా ఛాలెంజర్స్, జూన్‌లో ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 10/11 స్కోరుతో దూకుడు గేమ్ తో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. లండన్‌లో జరిగిన 2025 వరల్డ్ రాపిడ్, బ్లిట్జ్ టీమ్ ఛాంపియన్ షిప్‌లలో వరల్డ్ నంబర్ 1 హౌ యిఫాన్‌ను ఓడించింది.







