China Air Defense: భారత సరిహద్దుల్లో చైనా మిలిటరీ నిర్మాణాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి!
భారత సరిహద్దు ప్రాంతంలో చైనా భారీ ఎయిర్ డిఫెన్స్ (China Air Defense) వ్యవస్థను అత్యంత వేగంగా నిర్మిస్తున్నట్టు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. 2020లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి కేవలం 110 కిలోమీటర్ల దూరంలోనే, టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. చైనా చేపడుతున్న ఈ మిలిటరీ కాంప్లెక్స్‌లో (China Air Defense) కమాండ్ కంట్రోల్ భవనాలు, బారాక్‌లు, వాహన షెడ్లు, ఆయుధ గోదాములు, రాడార్ పొజిషన్లు, క్షిపణి ప్రయోగ వేదికలకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నిర్మాణాల్లో మిస్సైల్ లాంచర్ వాహనాలను దాచి పెట్టేందుకు వాటిపై రిట్రాక్టబుల్ రూఫ్‌లను చైనా సైన్యం ఏర్పాటు చేస్తోంది. క్షిపణి ప్రయోగించే సమయంలో రూఫ్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత వాహనం ఎక్కడ ఉందో తెలియకుండా ఆ రూఫ్ తిరిగి కప్పేస్తుంది. అమెరికాకు చెందిన ఆల్ సోర్స్ అనాలసిస్ (All Source Analysis) అనే సంస్థ ఈ డిజైన్‌ను విశ్లేషించింది. భారత సరిహద్దు రేఖ (LAC)కి సమీపంలో, భారత్ అప్‌గ్రేడ్ చేసిన న్యోమా మిలిటరీ ఫెసిలిటీకి ఎదురుగా చైనా ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్‌ను వేగంగా నిర్మిస్తున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది.







