Bejing: సముద్ర గర్భాన్ని శోధనకు అండర్ వాటర్ ఫాంటమ్.. చైనీయులు ప్రత్యేక సృష్టి..!
రేపు ప్రపంచం ఏది ఆలోచిస్తుందో.. దాన్ని ఇప్పుడు చైనా (China) అమలు చేస్తుందన్నది కొత్త నానుడి. ప్రపంచం ఊహకు కూడా అందని విధంగా 3 గోర్జెస్ డ్యామ్ నిర్మించింది.అంతేనా కృత్రిమ చంద్రుడి ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది.ఇలా ఎన్నో అనితర సాధ్యమైన సాంకేతికాంశాలను కనుగొంటున్న చైనా.. మరో అద్భుత కార్యానికి శ్రీకారం చుట్టింది. సముద్ర గర్భంలో నిఘా కార్యకలాపాలకోసం ఓ రోబోను సృష్టించింది. ఇది సముద్ర గర్భంలోని పర్యావరణానికి, జీవులకు ఎలాంటి హాని కలగకుండా తన పని తాను చేసుకుపోతుంది.చూడటానికి అచ్చం నిజమైన జెల్లీఫిష్‌లా కనిపించే ఈ రోబోను “అండర్‌వాటర్ ఫాంటమ్” అని పిలుస్తున్నారు.
చైనాలోని నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు టావో కాయ్ నేతృత్వంలోని బృందం ఈ బయోనిక్ జెల్లీఫిష్‌ను రూపొందించింది. హైడ్రోజెల్ ఎలక్ట్రోడ్ అనే ప్రత్యేక పదార్థంతో దీని పారదర్శక శరీరాన్ని, టెంటకిల్స్‌ను తయారు చేశారు. ఇది నీటిలో కదులుతున్నప్పుడు నిజమైన జెల్లీఫిష్‌కు, దీనికి తేడాను గుర్తించడం చాలా కష్టం. 120 మిల్లీమీటర్ల వ్యాసం, కేవలం 56 గ్రాముల బరువుతో ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.
ఈ రోబో పనితీరు గురించి టావో కాయ్ వివరిస్తూ, “ఇది చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. దాదాపు శబ్దం చేయకుండా పనిచేస్తుంది. దీని స్వరూపం నిజమైన జీవిలాగే ఉండటం వల్ల సముద్ర గర్భంలో రహస్య నిఘాకు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను పరిశీలించడానికి, నీటి అడుగున ఉన్న నిర్మాణాలను కచ్చితత్వంతో తనిఖీ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది” అని సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీకి తెలిపారు.
ఈ రోబోలో ఒక కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిప్‌ను అమర్చారు. మెషిన్ లెర్నింగ్ ద్వారా ఇది నీటి అడుగున ఉన్న లక్ష్యాలను స్వయంగా గుర్తించగలదు. జెల్లీఫిష్ నాడీ సంకేతాలను అనుకరించే ఎలక్ట్రోస్టాటిక్ హైడ్రాలిక్ యాక్యుయేటర్ సాయంతో ఇది కదులుతుంది. ఇటీవలే చైనా ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీలో ప్రసారమైన ఒక సైన్స్ కార్యక్రమంలో ఈ రోబో సామర్థ్యాలను ప్రదర్శించారు. నీటి ప్రవాహంలో మార్పులు వచ్చినా స్థిరంగా ఉండటం, క్లౌన్‌ఫిష్ వంటి నిర్దిష్ట జీవులను కచ్చితత్వంతో గుర్తించడం వంటివి చేసి చూపించారు.
నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ రోబోటిక్స్, ఏరోస్పేస్ రంగంలో అత్యాధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. పక్షులు, కీటకాలను పోలిన రోబోలను తయారు చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సముద్ర గర్భంలో అన్వేషణకు సంబంధించిన ఇంధన సామర్థ్యం, నిశ్శబ్ద పనితీరు వంటి సవాళ్లను అధిగమించడంలో ఈ జెల్లీఫిష్ రోబో ఒక కీలక ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు.







