Pakistan: సిందూర్ ఎఫెక్ట్ తో పాక్ కీలక నిర్ణయం..

చైనాకు చెందిన బైడూ ఉపగ్రహ వ్యవస్థ(beidou satellite)ను మరింత వాడుకొనేలా ఒప్పందం ..?
ఆపరేషన్ సిందూర్ .. పాకిస్తాన్ (Pakistan) ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. రోజుల వ్యవధిలో వరుస ఎదురుదెబ్బలు ఆదేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పక్క నుంచి చైనా (China), టర్కీ ఆయుధాలు, సాంకేతికత అందించినా …. అవి అక్కరకు రాలేదు. ఫలితంగా పాక్ కాళ్ల బేరానికి రాక తప్పలేదు. యుద్ధం ముగిసింది.. ఇప్పుడు తాము ఎక్కడ తప్పు చేశామన్న అంశంపై ఆత్మ పరిశీలన చేసుకున్న పాకిస్తాన్.. ..డ్రాగన్‌కు చెందిన బైడూ ఉపగ్రహ వ్యవస్థను మరింత వాడుకొనేలా ఒప్పందం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇరుదేశాల మధ్య మే 16వ తేదీన వ్యూహాత్మక సమావేశం జరిగింది.
భారత కార్యకలాపాలు గమనించడం, ఆ సమాచారాన్ని ఇరుదేశాలు పంచుకోవడం వంటి అంశాలపై ఇరుదేశాల మిలిటరీలు చర్చలు జరిపాయి. దీంతోపాటు పాక్ 5జీ కమ్యూనికేషన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకొని.. రియల్‌టైమ్ సమన్వయం, నిఘా సామర్థ్యాలను పెంచుకొనే అంశం కూడా చర్చకు వచ్చింది. వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ వేళ కూడా చైనా సమగ్రంగా శాటిలైట్ కవరేజీని పాకిస్థాన్‌కు అందజేసింది. డ్రాగన్ మిలిటరీ, పరికరాల రూపంలో సాయం అందించినా.. భారత్ చేతిలో మాత్రం పాక్ సైన్యం చావు దెబ్బతింది. దానికి చెందిన ఎనిమిదికి పైగా మిలిటరీ బేస్‌లు భారత్ దాడులకు కుదేలయ్యాయి. ఇక భారత దళాలు చాలావరకు స్వదేశీ ఆయుధ వ్యవస్థలతోనే చైనా తయారీ పరికరాలను నిర్వీర్యం చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 వ్యవస్థను న్యూఢిల్లీ వినియోగించింది.
ఇస్రోతోనే పాక్‌ను చావుదెబ్బతీసి..
భారత్ భారీస్థాయిలో ఉపగ్రహాలను కూడా ఆపరేషన్ సిందూర్ కోసం మోహరించింది. వీటిల్లో ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతోపాటు.. అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకొంది. భారత్ వద్ద 9-11 మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇస్రో వీటి నుంచి నిరంతర డేటాను దళాలకు చేరవేసింది. దీంతోపాటు ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి చిత్రాలను సేకరించింది. ఇస్రో సొంతంగా వాడే కార్టోశాట్ సిరీస్‌లోని ఉపగ్రహాలను కూడా రంగంలోకి దించింది. వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి.. పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. అమెరికాకు చెందిన మ్యాక్సర్, ఐరోపాకు చెందిన సెంటినెల్ సేవలు కూడా భారత్ వాడుకొంది. వీటి నుంచి రోజూ ఒక్కసారి డేటా డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. ఇక మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను 14 రోజులకు ఒకసారి తీసుకొనే అవకాశం ఉంది.
భారత్ కార్టోశాట్ శ్రేణి ఉపగ్రహాలను తొలిసారి 2005లో ప్రయోగించింది. వీటిద్వారా హైరిజల్యూషన్ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. మన ఇంటెలిజెన్స్‌లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ తర్వాత కార్టోశాట్ 2సీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చాము. ఇవి ఆపరేషన్లకు సంబంధించిన కీలక సమాచారం ఇస్తున్నాయి. ఇవి 0.65 మీటర్ల రిజల్యూషన్ ఇవ్వగలవు. వీటిల్లో ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ (ఏఓఐ)లను మాత్రం అత్యధిక రిజల్యూషన్‌తో పొందవచ్చు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌లో వీటిని వాడారు. భారత మిలిటరీ కోసం నిరంతరం 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. భారత్ వచ్చే ఐదేళ్లలో 100 నుంచి 150 ఉపగ్రహాలు ప్రయోగించాలని భావిస్తోంది.