లండన్ లో మోదీకి మద్దతుగా.. ఎన్నారైలు ర్యాలీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ మరో సారి విజయం సాధించాలని కోరుతూ లండన్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 కార్లతో లండన్లోని ప్రధాన వీధుల గుండా మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తూ వందలాది మంది ఎన్ఆర్ఐలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లండన్ బీజేపీ ప్రతినిధులు, హైదరాబాద్కు చెందిన గుండా షణ్ముఖ, సురేష్ మంగళగిరి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, అందుకు కారణం మోదీ పదేళ్ల పనితీరే అని అన్నారు. దేశ, యువత భవిష్యత్తు కోసం మరోసారి భారత్లో మోదీ ప్రధాని కావాల్సిన అసవరం ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో నివసించే ప్రతి ప్రవాస భారతీయులందరూ మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని వారు తెలిపారు. భారతదేశంలోని ఓటర్లకు మోదీ ప్రధాని కావాలన్న సందేశాన్ని ఇవ్వడం కోసం లండన్లో కార్ల ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో పులి వెంకట్ వేణు, కలకోట, వివేక్ తులసి, అశ్విన్ విశ్వాస్, శ్రవణ్, బీజేపీ అభిమానులు పాల్గొన్నారు.






