SKY: ఫీజు మొత్తం వాళ్లకే..! శెభాష్ సూర్యా భాయ్..!!

ఆసియా కప్ (Asia Cup) ను టీమిండియా (Team India) సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా పాకిస్తాన్ (pakistan) తో మూడు మ్యాచుల్లో తలపడి మూడింటిలోనూ విజయం సాధించింది. టీమిండియాకు నేతృత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav).. ఈ టోర్నమెంట్ లో పెద్దగా రాణించలేదు. అయితే టోర్నమెంట్ అనంతరం తన మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని ఇండియన్ ఆర్మీకి, పహల్గామ్ బాధితులకు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో భారతీయుల మనసు గెలుచుకున్నాడు.
ఈ ఏడాది ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. అబుదాబి, దుబాయ్ లలో మ్యాచ్ లు జరిగాయి. సెప్టెంబర్ 11 నుంచి 28 వరకు జరిగిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 7 మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ విజయం సాధించింది. 9వసారి ట్రోఫీని సాధించుకుంది. టోర్నీలో విజయం సాధించినందుకు టీమిండియా 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇందులో.. తన వాటాగా వచ్చిన మ్యాచ్ ఫీజ్‌ను భారత ఆర్మీకి, పహల్గామ్ విజేతలకు ఇవ్వనున్నట్టు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రతి మ్యాచ్‌కు 4 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజ్ వస్తుంది. మొత్తం 7 మ్యాచ్‌లకు 28 లక్షలు సూర్యకు వస్తాయి.
ఫైనల్స్ లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో ఆద్యంతం డ్రామా జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఏసీసీ చీఫ్ నుంచి ట్రోఫీని తీసుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ నిరాకరించారు. దీనిపై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే వాటిని సూర్య తిప్పికొట్టారు. తాము ట్రోఫీ కోసం ఆడలేదని, దేశం కోసం ఆడామని చెప్పారు. పహల్గాం బాధిత కుటుంబాలకు మద్దతుగా తన ఫీజ్ మొత్తాన్ని వాళ్లకు అందించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ విజయాన్ని ఆర్మీకి అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. 2023 వరల్డ్ కప్ సమయంలో కూడా భూకంప బాధితులకు సూర్య కుమార్ యాదవ్ విరాళాలు ఇచ్చాడు. ముంబైలోని అనాథ పిల్లలకు మద్దతుగా పని చేస్తున్నాడు.
మ్యాచ్ ఫీజును ఆర్మీకి విరాళం ఇవ్వడం, విజయాన్ని ఆర్మీకి అంకితం చేయడంపై సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో SKYDonates హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు ట్రెండ్ అయ్యాయి. మీరు నిజమైన కెప్టెన్ అంటూ నెటిజన్లు కొనియాడారు. భారత క్రికెట్ బోర్డు (BCCI) కూడా సూర్య నిర్ణయాన్ని స్వాగతించింది.