Canada-India: భారత్ తో కలిసి నడుస్తామంటున్న కెనడా…! కొత్తసర్కార్ రాకతో చిగురిస్తున్న మైత్రీ బంధం..

భారత్, కెనడాల మధ్య సంబంధాలను పునర్ నిర్మించుకోవడంపై దృష్టిసారించామని కెనడా (Canada) విదేశీ వ్యవహారాల మంత్రి అనితా ఆనంద్ (Anita Anand) పేర్కొన్నారు. ఇటీవల ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా పలు దౌత్యపరమైన విషయాలను గురించి కూడా వీరు చర్చించారు (Indian-Canada).
న్యూఢిల్లీతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు అనిత. అందుకు ఒక్కో అడుగు ముందుకువేస్తున్నట్లు తెలిపారు. నిజ్జర్ హత్య కేసును అనిత ప్రస్తావిస్తూ.. చట్టబద్ధమైన పాలన ఎప్పటికీ రాజీపడదన్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోందన్నారు. ఇదే సమయంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడంలో ఇది ఒక భాగమని ఆమె వెల్లడించారు.
ఇక, ట్రూడో (Justin Trudeau) అధికారంలో ఉన్న సమయంలో భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) ఇప్పటికే అనేకసార్లు పేర్కొన్నారు. కెనడియన్లు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్‌తో సంబంధాలు కలిగిఉంటారన్నారు. సంబంధాలు తెగిపోవడానికి కారణమైన విభేదాలను పరిష్కరించడానికి తాము కృషి చేస్తామన్నారు.
దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్, కెనడాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) గతంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ వెంటనే వాటిని తిప్పికొట్టింది. ఆ క్రమంలోనే వరసగా జరిగిన కొన్ని పరిణామాలతో ఉభయదేశాల దౌత్య, వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో కెనడా ఎన్నికల్లో కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంలో విజయం సాధించింది. ఆయన భారత్‌కు అనుకూలంగా ఉండడంతో భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.