Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ రాజీనామాకు సిద్ధమయ్యారా..?

పార్టీలమధ్య అనైక్యత, అతివాదుల డిమాండ్లు, సైన్యంలో వ్యతిరేకత, ప్రజల్లోనూ కానరాని సానుభూతి వెరసి బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక సారథి యూనస్ రాజీనామాకు సిద్ధమయ్యారా…? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా(shiek hasina) రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయిన తర్వాత.. ఆమె స్థానంలో తాత్కాలిక సారథిగా యూనస్ ఎన్నికయ్యారు. అన్ని పార్టీలు ఈ విషయంలో యూనస్ కు సహకరించాయి కూడా. దీనికి తోడు పాకిస్తాన్ ఐఎస్ఐ లోని ముఖ్యులు కూడా యూనస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో యూనస్ బంగ్లా సారథిగా మారారు.
ఇటీవలి కాలంలో చైనా, పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ పూసుకుని తిరుగుతోంది. సైనిక, విదేశీ సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది. అయితే ఇదే సమయంలో భారత్ పట్ల అంతులేని ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది. ఫలితంగా భారత్ సైతం.. అంతే దూరాన్నిపాటిస్తోంది. దీనికి తోడు భారత ఈశాన్య రాష్ట్రాలపై సాక్షాత్తూ యూనస్ చేసిన వ్యాఖ్యలు.. భారత్ కు ఆగ్రహం తెప్పించాయి. దీనికి తోడు నేతలు, అధికారులు అవాకులు, చవాకులు పేలి దీన్ని మరింతగా ఎగదోశారు కూడా . ఫలితంగా భారత్ సైతం చర్యలకు దిగింది.
ఇటీవల యూనస్ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్- ఉజ్- జమాన్ (Waker-Uz-Zaman)తో నెలకొన్న విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకొంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
ఈక్రమంలోనే ఎన్నికల నిర్వహణపై ఇటీవల ఆర్మీ చీఫ్ వకార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనా ఆయన అభ్యంతరం తెలిపారు. పదహారేళ్లపాటు కొనసాగిన షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం వల్ల పతనమైంది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె.. స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు.