బాల్టిమోర్ నౌకలోని భారతీయులు క్షేమం : జో బైడెన్
గతవారం అమెరికాలోని బాల్టిమోర్ వంతెనను ఢీకొన్న రవాణా నౌక డాలి లోని 21 మంది సిబ్బంది ఇప్పటికే నౌకలోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారనీ, దుర్ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు వారు నౌకలోనే ఉంటారని నౌక యజమాని అయిన సింగపూర్ సంస్థ ప్రకటించింది. బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళుతున్న ఈ రవాణా నౌక సిబ్బందిలో 20 మంది భారతీయులు కాగా, ఒకరు శ్రీలంకకు చెందినవారు. నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం వారితోనూ, స్థానిక అధికారులతోనూ నిత్యం సంప్రదిస్తోంది. డాలి నౌక అదుపు తప్పిందని సిబ్బంది ముందుగానే తెలియజేయడంతో వంతెనపై రాక పోకలను నిలుపు చేయగలిగారనీ ఇది ఎందరో ప్రాణాలను కాపాడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన బాల్టిమోర్ సందర్శించనున్నారు. నదిలో కూలిన వంతెన భాగాలను తొలగించి బాల్టిమోర్ రేవు నుంచి నౌక రవాణా సాఫీగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.






