Quetta: పాకిస్తాన్ కు పక్కలో బల్లెం బలోచిస్తాన్ రెబల్స్…

బలోచ్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Army) పాకిస్థాన్ (Pakistan) సైన్యాన్ని వణికిస్తోంది. వరుస దాడులతో హడలెత్తిస్తోంది. గత రెండ్రోజుల్లో 27 మంది పాక్ సైనికులను మట్టుపెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. బీఎల్‌ఏకు చెందిన ఫతే స్క్వాడ్ కలాత్‌లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తుండగా ఈ దాడి చోటుచేసుకొంది.
మరో ఘటనలో క్వెట్టాలోని హజార్‌గంజ్‌లో ఐఈడీ పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది. కలాత్‌లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను , బుధవారం గుజ్రోకొర్ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హత్య చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. వీరిలో మేజర్ సయిద్ రబ్ నవాజ్ తరీక్ కూడా ఉన్నట్లు తెలిపింది. సమీపంలోని సైనిక కాన్వాయ్‌ను స్నైపర్లు లక్ష్యంగా చేసుకోవడంతో.. ఆ కాన్వాయ్ అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ బలోచ్ రెబల్స్ మొత్తం 286 దాడులు చేశారు. ఈ క్రమంలో వివిధ రకాల వ్యూహాలను అమల్లోకి తెచ్చారు. వీటిల్లో మూడు ఆత్మాహుతి దాడులు ఉన్నాయి. బీఎల్‌ఏ చేసిన మొత్తం దాడుల్లో 700 మందికి పైగా చనిపోయారు. 290 మందిని అదుపులోకి తీసుకొన్నట్లు బీఎల్‌ఏ చెబుతోంది. ఈ క్రమంలో 133 వాహనాలను లక్ష్యంగా చేసుకొంది. ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసింది. దీంతోపాటు ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రాంతాలను పాక్ నుంచి స్వాధీనం చేసుకొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.