Islamabad: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భారీ స్కెచ్.. నవాజ్ షరీఫ్ ఫామ్ హౌస్ లో కీలక భేటీ..?

పాకిస్తాన్ ఆర్మీచీఫ్ మునీర్ మరోసారి తనదైన మార్క్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న మునీర్.. ఇప్పుడు తన పదవీ కాలాన్ని పొడిగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రస్తుత ప్రభుత్వం సైతం సుముఖంగానే ఉంది. ఎందుకంటే మునీర్ పదవీకాలంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండబోదన్నది షెహబాజ్ షరీఫ్ భావనగా ఉంది. అంతేకాదు… తమ ప్రత్యర్థి ఇమ్రాన్ ఖాన్ .. బయటకు వచ్చే దారులు మూసుకుపోనున్నాయి.
పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి తెరవెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పూర్తిగా రాజకీయాలకు దూరం చేయడమే లక్ష్యంగా, ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన పదవీకాలాన్ని 2030 వరకు పొడిగించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు షరీఫ్ ప్రభుత్వంతో కలిసి ఆయన ఓ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు సమాచారం.
ఇటీవల ముర్రీలోని పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ఫామ్‌హౌస్‌లో అత్యంత రహస్యంగా ఓ ఉన్నతస్థాయి సమావేశం జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ భేటీలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో పాటు ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ కూడా పాల్గొన్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం ప్రస్తుత వ్యవస్థను మరో పదేళ్లపాటు కొనసాగించాలనే అంశంపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది.
జనరల్ మునీర్ ప్రస్తుత పదవీకాలం 2025 నవంబర్ 28తో ముగియనుంది. అయితే, 1952 పాకిస్థాన్ ఆర్మీ చట్టానికి చేసిన సవరణల ప్రకారం, ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. గతంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాకు కూడా ఇదే విధంగా మూడేళ్ల పొడిగింపు ఇచ్చారు. అదే బాటలో మునీర్‌ను కూడా కొనసాగించడం ద్వారా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని షరీఫ్ సోదరులు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే, వివిధ కేసుల్లో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘకాలం పాటు బయటకు వచ్చే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి. మరోవైపు, అక్టోబర్‌లో పదవీకాలం ముగియనున్న ఐఎస్ఐ డీజీ అసిమ్ మాలిక్ సేవలను కూడా పొడిగించే అంశంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం