America: మరోసారి అమెరికా పర్యటన కు పాక్ ఆర్మీ చీఫ్!

ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ (Syed Asim Munir) మరోసారి అమెరికా పర్యటన(America tour) కు వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని పాక్ వెల్లడించింది. ఈ నెలలో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా (Kurilla) పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం. అసిం మునీర్ యూఎస్ సందర్శనకు వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో అసిం మునీర్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ (Trump) తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ వైట్ హౌస్ (White House)లో మునీర్‌కు ప్రత్యేకంగా విందు కూడా ఇచ్చారు.
భారత్‌పై అధిక సుంకాలు, పెనాల్టీలు విధించిన ట్రంప్, పాకిస్థాన్‌తో జట్టుకట్టారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. పాక్‌తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. భారత్‌కు పాకిస్థాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని వెల్లడించారు.