Ind vs Pak: పాకిస్తాన్ తో పోటీ భారత్ రెడీ, అక్కడే మ్యాచ్ లు..?
                                    భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు అనగానే క్రికెట్ అభిమానుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే యుద్ద వాతావరణం మాదిరిగా ఉంటుంది. త్వరలో ఆసియా కప్ ఉన్న నేపధ్యంలో అసలు జరుగుతుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(PCB) నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్ పై నెలకొన్న సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసింది.
టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుందని తెలిపింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ శనివారం ఈ ప్రకటన చేసారు. ఆయనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ టోర్నీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ టోర్నీ కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నామన్నారు నఖ్వీ. షెడ్యూల్ ను త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
వాస్తవానికి ఈ టోర్నీని భారత్ లో నిర్వహించాల్సి ఉంది. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(BCCI) అభ్యంతరం తెలిపింది. దీనితో భారత్ తన మ్యాచ్ లను దుబాయ్ లో ఆడింది. భారత్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్తాన్.. తాము కూడా భవిష్యత్తులో భారత్ లో పర్యతించేది లేదని ప్రకటించింది. దీనితో మన బోర్డు దుబాయ్ లో ఆసియా కప్ మ్యాచ్ లు ఆడేందుకు అంగీకారం తెలిపింది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ దేశాలు ఆసియా కప్ ఆడతాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉంటాయి. ఇరు జట్లు ఫైనల్ వరకు వెళ్తే మొత్తం మూడు మ్యాచ్ లు రెండు దేశాల మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి.







