Ind vs Eng: గంభీర్ కు మ్యూజిక్ స్టార్ట్ అయిందా..?

గత 15 ఏళ్ళలో భారత క్రికెట్(Team India) జట్టు ఎంతో బలపడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా కనపడింది. కాని విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం లోపాలు బయటపడ్డాయి. అయితే వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత భారత్ కు తిరుగులేకుండా పోయిందనే చెప్పాలి. కాని హెడ్ కోచ్ గా గంభీర్(Gambhir) బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ రివర్స్ అయింది. జట్టులో కీలక మార్పులు జరగడం ఒకటి అయితే, శ్రీలంకలో వన్డే సీరీస్ ఓటమి, భారత్ లో న్యూజిలాండ్ తో వైట్ వాష్, ఆస్ట్రేలియాలో సీరీస్ ఓటమి విమర్శలు తెచ్చాయి.
దీనితో గంభీర్ పై అభిమానులు విమర్శల వేడి పెంచారు. ప్రస్తుతం జరుగుతోన్న ఇంగ్లాండ్ సీరీస్ లో కూడా భారత ఆటగాళ్ళ ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. బౌలింగ్ విభాగం సమర్ధవంతంగా లేకపోవడంతో.. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 669 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ ను కూడా గంభీర్ పక్కన పెట్టడంపై బోర్డు పెద్దలు సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) పిచ్ మీద అతను ఖచ్చితంగా ప్రభావం చూపే బౌలర్. కాని అతనిని జట్టులోకి తీసుకోలేదు.
ఇక గంభీర్ తో పాటుగా బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ లపై కూడా బోర్డు పెద్దలు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఆసియా కప్ తర్వాత కోచింగ్ స్టాఫ్ ను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ పై భారీ ఆశలే పెట్టుకున్నా.. అతను నిరాశ పరుస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. జట్టు వ్యూహాల్లో కోచింగ్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో అది లోపించింది. బ్యాటింగ్ ఆర్డర్ లో సమర్ధవంతంగా ఉన్న ఆటగాళ్లను సరిగా వినియోగించుకోవడం లేదనే విమర్శలు సైతం వినిపించాయి. అటు సెలెక్షన్ కమిటీపై కూడా బోర్డ్ సీరియస్ గా ఉన్నట్టు టాక్.