Flight: అమ్మో బోయింగ్, గుప్పిట్లో 173 మంది ప్రాణాలు
                                    ఈ రోజుల్లో విమాన ప్రమాదాల దెబ్బకు, విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ విమాన ప్రమాదం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. గత నెలలో ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రమాదం తర్వాత కొన్ని ఘటనలు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో డెన్వర్ విమానాశ్రయంలో శనివారం అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో రన్‌వేపై మంటలు, పొగలు రావడంతో అత్యవసరంగా ప్రయాణికులను దింపేశారు.
173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఒక వ్యక్తికి స్వల్ప గాయం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన కూడా బోయింగ్ విమానానికే జరిగడం గమనార్హం. బోయింగ్ 737 MAX 8 విమానం AA-3023 విమానం మయామికి వెళుతుండగా.. టైర్ లో సమస్యలు తలెత్తాయని విమానాయాన సంస్థ ప్రకటన విడుదల చేసింది. విమానం ల్యాండింగ్ గేర్ మంటల్లో ఉన్న సమయంలో ప్రయాణికులు అత్యవసర ద్వారా బయటకు వస్తున్న వీడియో ఒకటి రిలీజ్ చేసారు.
ఈ ఫూటేజ్ లో మంటలు, పొగలు రావడం స్పష్టంగా కనపడుతుంది. చిన్న పిల్లలను ఎత్తుకుని విమానం దిగుతున్న వీడియో ఆందోళన కలిగించింది. డెన్వర్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు విమానం బయల్దేరే సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. అగ్నిప్రమాద ఘటనపై మరింత దర్యాప్తు చేస్తామని పేర్కొంది. ఐదు నెలల్లో డెన్వర్‌లో విమానాల్లో అగ్ని ప్రమాదం సంభవించడం ఇది రెండోసారి. మార్చిలో, డల్లాస్‌కు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం – బోయింగ్ 737-800 – విమానాశ్రయంలో మంటల్లో చిక్కుకుంది.







