Delhi: చైనీయులకు వీసాల ప్రక్రియ షురూ.. సంబంధాల మెరుగుదలపై భారత్ చూపు..

అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్ గా చైనా దురాక్రమణలతో గత కొంతకాలంగా ఆదేశంతో అన్నిరకాల సంబంధాలను నిలిపివేసింది భారత్. అంతేకాదు.. చైనాకు చెందిన పలు సంస్థలపై బ్యాన్ కూడా విధించింది. మరీ ముఖ్యంగా కొవిడ్, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో భారత్ (India).. చైనా (China) పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను సస్పెండ్ చేసింది. అయితే ఇటీవలి కాలంలో చైనా వైపు నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో… ఆదేశంతో బంధాన్ని మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టింది ఇండియా.
ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేలా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల తర్వాత చైనీయులకు భారత్ టూరిస్టు వీసాల (Tourist Visa) జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరుచేయనున్నట్లు తెలియజేసింది.
2020 ప్రారంభంలో కొవిడ్ (COVID-19) మహమ్మారి కారణంగా చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న సుమారు 22 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలోనే భారత్ అన్ని దేశాల టూరిస్టు వీసాల జారీలను నిలిపివేసింది. కొంతకాలం తరువాత విద్యార్థులు భౌతికంగా తరగతులకు హాజరవుతామని అభ్యర్థించినప్పటికీ రెండేళ్లైనా చైనా వారిని అనుమతించలేదు. ఈవిషయంపై ఆ దేశానికి భారత ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ డ్రాగన్ స్పందించకపోవడంతో.. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేస్తూ.. 2022లో భారత్ తరఫున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ఓ సర్క్యులర్ జారీ చేసింది.
కొవిడ్ 19, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో భారత్-చైనాల మధ్య విభేదాలు తీవ్రరూపు దాల్చాయి. దీంతో ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు. అయితే, ఇటీవల లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి విషయాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) చైనా పర్యటనకు వెళ్లి, అక్కడి అధినాయకత్వంతో చర్చించారు.