USA: అమెరికాలో తల్లిదండ్రులు లేకుండా జీవిస్తున్న 4 శాతం చిన్నారులు!
అమెరికాలో (USA) కుటుంబ వ్యవస్థ స్వరూపం వేగంగా మారుతోంది. యూఎస్ సెన్సస్ బ్యూరో 2022 కరెంట్ పాపులేషన్ సర్వే డేటాను విశ్లేషించిన వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, దేశంలో దాదాపు 4 శాతం మంది చిన్నారులు (Children) వారి తల్లిదండ్రులు (కన్న, దత్తత లేదా సవతి) ఎవరూ లేకుండానే జీవిస్తున్నారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు పిల్లల్లో ప్రతి పది మందిలో నలుగురు సంప్రదాయ కుటుంబాలకు భిన్నమైన పరిస్థితుల్లో పెరుగుతున్నారని తేలింది.
ఈ డేటా ప్రకారం, 2022 నాటికి అమెరికాలో కేవలం 62.9 శాతం మంది పిల్లలు (Children) మాత్రమే కన్న తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ఇది ఇప్పటికి అత్యధిక శాతమే అయినప్పటికీ, మిగిలిన వారి కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశంలో ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు (సుమారు 25%) ఒంటరి తల్లి లేదా తండ్రి సంరక్షణలో పెరుగుతున్నారు. ఆ తర్వాత 5.1 శాతం మంది చిన్నారులు ఒక కన్న తల్లి/తండ్రి, ఒక సవతి తల్లి/తండ్రితో కలిసి ఉంటున్నారు.
ఈ విశ్లేషణలో దత్తతకు (Adoption) సంబంధించి కూడా ఆసక్తికర వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఇతర వర్గాలతో పోలిస్తే స్వలింగ సంపర్క జంటలు పిల్లలను (Children) దత్తత తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. అదేవిధంగా, ఇతర సమూహాల కంటే నేటివ్ అమెరికన్ పెద్దలలో కూడా దత్తత తీసుకునే ధోరణి అధికంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ గణాంకాలు అమెరికన్ సమాజంలో మారుతున్న సామాజిక, కుటుంబ సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయి.






