Adelaide:: ఆస్ట్రేలియాలో పెచ్చరిల్లిన జాత్యహంకారం.. భారతీయ విద్యార్థిపై అమానుష దాడి..

ఆస్ట్రేలియా (Australia) లో రేసిజం బుస కొట్టింది. సభ్యసమాజం తలవంచుకునేలా అమానుష ఘటన చోటు చేసుకుంది.అడిలైట్ సిటీలో ఓ ఇండియన్ స్టూడెంట్ పై ఐదుగురు వ్యక్తులు అమానుషంగా దాడి చేశారు.ఈఘటనలో సదరు బాధితుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాలోని స్టూడెంట్ కమ్యూనిటీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రప్రీత్ సింగ్ అనే వ్యక్తి చదువు నిమిత్తం కొన్ని నెలల క్రితమే భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు.
అడిలైడ్‌లో ఇళ్లు తీసుకుని ఉంటున్నాడు. జులై 19వ తేదీన లైట్ల ప్రదర్శన చూడటానికి తన భార్యతో కలిసి కిన్‌టోర్ అవెన్యూకు వెళ్లాడు. అక్కడికి చేరుకుని కారు పార్క్ చేస్తూ ఉండగా.. వెనుక నుంచి ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఓ ఐదుగురు వ్యక్తులు కిందకు దిగారు. చంద్రప్రీత్ కారు దగ్గరకు వచ్చారు. ‘భారతీయుడా….’ అంటూ బూతులు తిడుతూ అతడిపై విరుచుకుపడ్డారు. ఓ వ్యక్తి చేతికి ఇనుప కంకణం ఉంది.
దాని సాయంతో ఆ వ్యక్తి కారు అద్దాన్ని బద్దలు కొట్టాడు. తర్వాత అందరూ కలిసి చంద్రప్రీత్‌ను బయటకు లాగి చేతులు, కాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కిందపడేసి మరీ కొట్టారు. తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ చంద్రప్రీత్‌ను ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల కారణంగా చంద్రప్రీత్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.