519 అన్నమయ్య ఆరాధన సందర్భంగా మహానగర సంకీర్తన

అన్నమాచార్య భావనా వాహిని అధ్వర్యంలో అన్నమయ్య ఆరాధన పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయ కారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రియభక్తుడు, స్వామి వారి ఖడ్గమైన నందకాంశ సంభూతుడు, 32 వేల సంకీర్తనా సుమాలను స్వామి వారికి అర్పించిన దివ్యాంశ సంభూతుడు అయిన అన్నమాచార్యులవారు శ్రీ వేంకటేశ్వర స్వామి లో లీనమైన రోజు ఫాల్గుణ బహుళ ద్వాదశి. మార్చి 29 న అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవం (పుణ్య తిథి) సందర్భంగా ప్రముఖ గాయని, వాగ్గేయకారిణి “ అన్నమాచార్య భావనా వాహిని” వ్యవస్థాపకురాలు అయిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజుగారి ఆధ్వర్యంలో అన్నమయ్య 519 వ ఆరాధనోత్సవాని 29 వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7 గంటలకు ట్యాంక్ బండ్ పైన గల అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహించనున్నారు.
కరోనా మూలంగా గత రెండు సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని హై టెక్ సిటీ లోని అన్నమయ్యపురంలో నిర్వహించడానికి, ‘మహా నగర సంకీర్తన’ నిర్వహించడానికి అవకాశం లేకున్నా గత రెండు సంవత్సరాలుగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అంతర్జాలంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం చిక్కడపల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద “ మహా నగర సంకీర్తన” ప్రారంభం అవుతుందని, అనంతరం ట్యాంక్ బండ్ పైన గల అన్నమయ్య విగ్రహం వద్ద ఆరాధనోత్సని నిర్వహించనున్నామని, ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో 9-30 వరకు అన్నమయ్య సంకీర్తనాలాపన కొనసాగుతుందని, పూజ్యులు శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథి గా పాల్గొనబోయే ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కాగలరని, ఉదయం 7 గంటలకల్లా అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకొని, ఈ పుణ్య సంకీర్తనా యజ్ఞం లో పాలు పంచుకొని, స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని నిర్వాహకులు కోరుతున్నారు.