కొవిడ్ కు కొత్త ఔషధాలు..
కొవిడ్-19కు చికిత్స చేయడంలో సాయపడే వందలాది ఔషధాలను గుర్తించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాన్ని తయారు చేశారు. వీరిలో భారత సంతతికి చెందిన ఆనందశంకర్ రే కూడా ఉన్నారు. కరోనా బాధితులకు చికిత్స చేయడానికి సమర్థ ఔషధాలు అవసరమని ఆనందశంకర్ చెప్పారు. రెమిడెసివిర్ వంటి కొన్ని ఔషధాలు ఈ మహమ్మారికి చికిత్స చేయడానికి కొంతమేర ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అయితే మరిన్ని కొత్త ఔషధాల ఆవిష్కారానికి అవసరం ఏర్పడిందన్నారు. మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశం, పునరుత్పత్తిలో ముఖ్యమైన ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యమున్న ప్రస్తుత ఔషధాలను కొవిడ్-19కి మళ్లించే అవకాశానిన వీరు పరిశీలించారు.
కరోనా వైరస్ ప్రొటీన్లతో సంధానమయ్యే 65 మావన ప్రొటీన్లపై వీరు దృష్టి సారించారు. ఒక్కొ మానవ ప్రొటీన్ కోసం వేరువేరు మెషీన్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేశారు. మానవ ప్రొటీన్లకు సంబంధించిన త్రీడీ నమూనాల ఆధారంగా వాటిని నియంత్రించే ఔషధాలను గుర్తించేలా వీటికి శిక్షణ ఇచ్చారు. వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న మందులను ఈ నమూనాలతో స్క్రీన్ చేశారు. వాటిలో 65 మానవ ప్రొటీన్లకు సరిపడే ఔషధాలు గుర్తించారు. ఇవన్నీ ఆమోదం పొందినవేనని శాస్త్రవేత్తలు చెప్పారు. తమ నమూనా సాయంతో సదరు ఔషధాల విషత్యులతను కూడా పరిశీలించామన్నారు. కరోనా చికిత్సకు అక్కరకొచ్చే వీలున్న వందలాది ఔషధాలను గుర్తించామని తెలిపారు.






