కరోనాకు ఔషధం కనిపెట్టిన మరో్ కంపెనీ…హెటిరో
– కోవిడ్-19 చికిత్సకు `కోవిఫర్` (రెమ్డిసివిర్) మార్కెట్లోకి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సకు ఉపకరించే ఔషధాన్ని మరో భారతీయ కంపెనీ ఆదివారం విడుదల చేసింది. ఇప్పటికే గ్లెన్‌మార్క్ కంపెనీ టాబ్లెట్ రూపొందించి విడుదల చేసింది. ఒక్కరోజు కాకుండానే మరో భారతదేశం సుప్రసిద్ధ జెనిరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన హెటిరో కరోనా మహమ్మారిపై పోరాటంలో కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా, ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్ మెడిసిన్ `రెమ్డిసివిర్` ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందినట్లు వెల్లడించింది. రెమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్‌కు `కోవిఫర్` అనే పేరుతో భారతదేశంలో మార్కెట్లోకి రానుంది.
ఈ సందర్భంగా హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, `భారతదేశంలో కోవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని `కోవిఫర్`(రెమ్డిసివిర్) అందుబాటులోకి రావడం గేమ్ చేంజర్‌గా మారనుంది. బలమైన ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను కలిగి ఉండటం వల్ల ఈ ఉత్పత్తి భారతదేశవ్యాప్తంగా వెంటనే రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నెలకొన్న అవసరాలకు తగిన రీతిలో రోగులకు తగినట్లుగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య విభాగాలతో నిరంతరం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మన ప్రధాని `మేక్ ఇన్ ఇండియా` ప్రచారానికి తగినట్లుగా భారతదేశంలో ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దాం“ అని ప్రకటించారు.
డీసీజీఐచే అనుమతి పొందిన `రెమ్డిసివిర్` ఔషధాన్ని కోవిడ్ అనుమానితులు లేదా ల్యాబ్‌లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత మరియు కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి శస్త్రచికిత్స కోసం వినియోగించవచ్చు. 100 మిల్లీగ్రాముల వయల్ (ఇంజెక్షన్) రూపంలో కోవిఫర్ (రెమ్డిసివిర్) అందుబాటులో ఉంది. వైద్య సేవలు అందిస్తున్న వారి పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించవచ్చు. తక్కువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాలలోని ప్రజలకు కోవిడ్-19 చికిత్స చేయడంలో భాగంగా గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీ. తో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.






