అమెరికా కొత్త ఆంక్షలు
చైనా కంపెనీ హువావెపై అమెరికా ప్రభుత్వం కొత్త ఆంక్షలను విధించింది. విదేశాల్లో సెమీ కండక్టర్ల డిజైన్, ఉత్పత్తి విషయంలో అమెరికా సాంకేతికతను వినియోగించకుండా గతంలో విధించిన ఆంక్షలను హువావె ఉల్లంఘించకుండా చూడాలని అమెరికా భావిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ పేర్కొన్నారు. సాంకేతికతంగా ఉన్న లొసుగులను ఉపయోగించి హువావె అమెరికా సాంకేతికతను ఉపయోగించుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అమెరికా- చైనాల మధ్య వివాదాల్లో ఈ కంపెనీ కూడా ఒక భాగం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దేశ రక్షణ విషయంలో హువావె వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అమెరికా అధికారులు ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే కంపెనీ ఆ విషయాలను ఖండిస్తోంది. అమెరికా సాంకేతిక దిగ్గజాలకు పోటీదారుగా ఎదుగుతున్న కంపెనీని ఇబ్బందుల పాలు చేసేందుకే భద్రతపరమైన హెచ్చరికలను దుర్వినియోగం చేస్తోందని, చైనా ప్రభుత్వం సైతం ఆరోపిస్తూనే ఉంది.





