TANA: ర్యాలీలో ఘనంగా ముగిసిన తానా జాతీయ సాంస్కృతిక పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) తెలుగువారి ఐక్యత కోసం దాదాపు అర్ధ శతాబ్దంగా కృషి చేస్తోంది. అమెరికాలో స్థిరపడినవారితోపాటు అమోరికాకు కొత్తగా వచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను, పోటీలను నిర్వహిస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందిస్తోంది. తెలుగు భాష, తెలుగు పండుగలు, తెలుగు ఉత్సవాలు, తెలుగు వేడుకలు నిర్వహిస్తోంది. తెలుగువారి ఉన్నతికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది. అమెరికా గడ్డపై తెలుగుదనం ఉట్టిపడేలా చేస్తోంది. తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా ఆర్. కటికి ఆధ్వర్యంలో తానా జాతీయ సాంస్కృతిక పోటీలు ఇలినాయిలోని నాపర్విల్లో గత ఆగస్టులో ప్రారంభమయ్యి నవంబర్ 2న నార్త్ కరోలినా రాష్ట్రంలోని ర్యాలీ నగరంలో ముగిసింది. మొదట రీజయిన్ల వారీగా ప్రాథమిక పోటీలు నిర్వహించారు. తానా కల్చరల్ కాంపిటీషన్ 24 పోటీల్లో భాగంగా గీతాలాపన(శాస్త్రీయ సంగీతం, జానపదం, సినిమా), నాట్యం పోటీలు నిర్వహించారు. 25 ఏళ్లు పైబడిన వారికి డ్యాన్స్ జోడీ పోటీలు నిర్వహించారు. పాటల పోటీల విజేతలకు వాయిస్ ఆఫ్ తానా అవార్డు, డాన్స్‌లో విజేతలకు తానా అల్టిమేట్ డాన్స్ ఛాంపియన్ అవార్డు ఇచ్చారు. జోడీ డాన్స్‌లో తానా డాన్స్ జోడీ అవార్డు ఇచ్చారు. రీజియన్ల వారీగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతోపాటు తర్వాతి పోటీలకు ఎంపిక చేశారు. తాజాగా పోటీలు ఫైనల్‌కు చేరాయి.
నవంబర్ 2న నార్ కరోలినాలో ర్యాలీలో ఫైనల్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే సురేశ్ కాకర్ల హాజరయ్యారు. మరో గెస్ట్‌గా హీరోయిన్ శివానీ రాజశేఖర్ హాజరయ్యారు. ఫైనల్ పోటీలు వీక్షించేందుకు సుమారు 1,200 మందికి పైగా వీక్షకులు హాజరవడం విశేషం. తానా జాతీయ సాంస్కృతిక పోటీల ఫైనల్స్ నిర్వహించి బహుమతులు, ట్రోఫీలు అందించారు. ఈ సాంస్కృతిక పోటీలలో భాగంగా ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉన్నాయి. చక్కని అభినయంతో తెలుగుతనం వెల్లివిరిసేలా ర్యాలీ నగర కళాకారులు అందరినీ మంత్రముగ్దులను చేసింది. పలువురు గాయనీ గాయకులు తమ గాత్రంతో ఔరా అనిపించారు.
వాయిస్ ఆఫ్ తానా, తానా అల్టిమేట్, డాన్స్ ఛాంపియన్స్, తానా డాన్స్ జోడి అంటూ పలు కేటగిరీస్ లో ఈ తానా జాతీయ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల కోసం వేదికను అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, షాపింగ్ స్టాల్స్, ర్యాఫుల్ ప్రైజెస్, ఆటపాటలతో ఆహ్వానితులను అలరించారు. ఈ కార్యక్రమానికి సౌమ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంది. తానా కల్చరల్ కోఆర్డినేటర్ డా. ఉమ ఆరమండ్ల కటికి చికాగో నుంచి ఈ జాతీయ సాంస్కృతిక పోటీల ఫైనల్స్ కోసం ర్యాలీ విచ్చేశారు.
తానా అపలాచియన్ రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మరియు ఇతర తానా నాయకులు పాల్గొన్నారు. సురేష్ కాకర్ల, శివాని రాజశేఖర్ చేతులమీదుగా మెమెంటోలు అందజేశారు. వేడుకలకు అతిథిగా హాజరైన నార్త్ కరోలినా మోరిస్ విల్లే మేయర్ టీజే కాల్వే పోటీలను వీక్షిస్తూ ఎంజయ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు పోటీలు జరిగాయి. మొత్తం అన్ని విభాగాల్లో 200కు పైగా కళాకారులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా తనలోని ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయిన మేయర్ కూడా వేదికపైకి వచ్చి కాసేపు డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం జడ్జీలు విజేతలను ప్రకటించారు.
క్లాసికల్, నాన్ క్లాసికల్ విభాగాలలో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. నిత్య గింజుపల్లి, హేమ దాసరి, మిథున్ సుంకర, బాల గర్జల, వెంకి అడబాల, వినోద్ కాట్రగుంట, అన్వేష్ బొల్లం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో లీడ్ రోల్ ప్లే చేశారు. అలాగే పలువురు వాలంటీర్స్ చేసిన సహాయం మరువలేనిది. విజేతలకు బహుమతుల ప్రధానం అనంతరం తానా కల్చరల్ కోఆర్డినేట్ డా.ఉమా కటికి(ఆరమండ్ల) మాట్లాడారు. మూడు నెలలు రీజియన్ల వారీగా పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు, ఫైనల్ వేడుకలను విజయవంతం చేసిన తానా సభ్యులకు, వేడుకలను వీక్షించేందుకు వచ్చిన ప్రజలకు, ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన అతిథులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొన్నవారు ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రదర్శనలతో కార్యక్రమానికి వన్నె తెచ్చారని కొనియాడారు. విజేతలకు, పార్టిసిపెంట్స్ కి అభినందనలు తెలిపారు. ఈ పోటీలు ఎందరినో ఇన్స్పైర్ చేస్తాయని, జడ్జెస్, పార్టిసిపెంట్స్ పేరెంట్స్, స్పాన్సర్స్, కోఆర్డినేటర్స్, వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే సురేష్ కాకర్ల మాట్లాడుతూ పిల్లలు మన సంస్కృతీసంప్రదాయాలు మర్చిపోకుండా ఇటువంటి పోటీలు దోహదపడతా యన్నారు. ఒకప్పుడు తను తానాలో చేసిన సేవలను, వివిధ కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా కూడా తానా ర్యాలీ టీం ఒకే ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అభినందించారు. స్థానికంగా పలువురు ఈ పోటీలకు స్పాన్సర్స్ గా వ్యవహరించారు. టాలెంట్, సంస్కృతి, తెలుగుతనంతో నిండిన కార్యక్రమంగా తానా చరిత్రలో ఈ సాంస్కృతిక పోటీలు నిలిచిపోతుంది.







